గురువారం, జనవరి 01, 2015

మహా విష్ణు గాధలు...

మిత్రులకు నూతన సంవత్సర, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈపర్వదినాన ఆ మహావిష్ణువు మహిమలు తెలిపే పాటను గుర్తు చేసుకుందామా. బాపు గారి దర్శకత్వంలో వచ్చిన 'సీతా కళ్యాణం' చిత్రంలోని ఈ పాట చిత్రీకరణ బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సీతాకళ్యాణం (1976)
సంగీతం : కె వి మహదేవన్
సాహిత్యం : సి నారాయణరెడ్డి
గానం : పి సుశీల,
బి వసంత, పి బి శ్రీనివాస్, రామకృష్ణ

మహావిష్ణు గాధలు మధురసుధా ధారలు
మహావిష్ణు గాధలు మధురసుధా ధారలు
అవి విన్న వీనులే వీనులు 
కనుగొన్న కన్నులే కన్నులూ
మహావిష్ణు గాధలు మధురసుధా ధారలు

చేపయై . . కూర్మ రూపమై, వరాహుడై, నరహరీంద్రుడై
చేపయై . . కూర్మ రూపమై, వరాహుడై, నరహరీంద్రుడై
దిగివచ్చెను యీ ధరణికి ఆదిదేవుడు 
దైత్యుల తెగటార్చగ ఆ మహానుభావుడు
 
మహావిష్ణు గాధలు మధురసుధా ధారలు

బలిమితో దేవతల గెలువంగలేక
కలిమితో జన్నముల పున్నెముల కలిమితో
స్వర్గమును కాజేయ సమకట్టె
విశ్వజిద్యాగమును తాజేయ తలపెట్టె
బలిచక్రవర్తి అసుర కుల చక్రవర్తి

అనంతా అచ్యుతా మాధవా రమాధవా 
ఆదుకొమ్మని ఆర్తనాదములు చేయగా
ఆదివిష్ణువే అవనికై దయచేయగా..

అడుగో అడుగో . . అల్లన వచ్చెను వడుగు,
అలనల్లన వచ్చెను వడుగు
వాడసురల చిచ్చర పిడుగు
వేసెను బుడి బుడి అడుగు
అది వేదాలకు పట్టిన వెల్లగొడుగు

ఎక్కడిదీ పసి వెలుగు ఎవ్వరివాడో యీ వడుగు
ఏ తల్లి ఏ నోము నోచెనో ఏ తండ్రి ఏ తపము చేసెనొ
ఏ వూరు ఓ బాబు నీది ?
ఊరేగు వాని వూరేది ?
ఏ పేరు ఓ బాబు నీది ? ఏ పేరు పిలిచినా నాది
ఏమి కోరెద నీవు ? ఏమీయగల వీవు ?
మాడలా మేడలా వన్నెలా చిన్నెలా
వన్నియల చిన్నియల వలరాచ కన్నెలా?
 

ఉట్టికి ఎక్కని పొట్టికి దక్కని
స్వర్గ సుఖమ్ములు ఎందుకులే
ముద్దూ ముచ్చట లెరుగని వడుగుకు
మూడడుగులే చాలునులే
మూడడుగులే చాలునులే
మూడడుగులే చాలునులే

ఇంతింతై వటుడింతయై అంతంతై నభమంతయై 
అంతే తెలియని కాంతియై ఆగమ్య దివ్య భ్రాంతియై
విక్రమించెను అవక్ర విక్రముడై త్రివిక్రముడై

సూర్య బింబమ్మంత శోభిల్లెను,
ఛత్రమై శిరోరత్నమై
శ్రవణ భూషణమై, గళాభరణమై,
దండ కడియమ్మై, చేతి కంకణమై
నడుమునకు గంటయై, అడుగునకు అందెయై
పదముకడ రేణువై వటుడిటుల వర్ధిల్లి వర్ధిల్లి  వర్ధిల్లి
పదునాల్గు లోకాలు పదయుగళితో కొలిచీ..
 
ఏదీ ఏదీ ఏదీ.. మూడవ అడుగు ఎచట మోపేదీ ?
ఏదీ చోటేదీ అని వడుగు అడుగగా
తలవంచె బలిచక్రవర్తి
పాద తలముంచె శ్రీ విష్ణు మూర్తి !
విష్ణు మూర్తి ! శ్రీ విష్ణు మూర్తి..


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.