బుధవారం, అక్టోబర్ 03, 2012

శ్యామసుందరా ప్రేమమందిరా

ఆదినారాయణరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన భక్తతుకారం సినిమాలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్సే, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. ఇందులోని ఈ "శ్యామసుందరా ప్రేమమందిరా" పాటంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. తత్వాలతో కూడి పల్లెపదం/జానపదంలా అనిపించే ఈపాట ఎప్పుడు విన్నా నాకు తెలియకుండానే గొంతు కలిపేస్తాను.
 
దాశరధి గారి సాహిత్యంలో "అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటులేదురా", "అహము విడిచితే ఆనందమురా", "సాధన చేయుమురానరుడా సాధ్యముకానిది లేదురా", "అణిగిమణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు". "దొడ్డమానులను కూల్చుతుఫాను గడ్డిపరకను కదల్చగలదా", "బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు" వంటి మాటలు జీవితాంతం గుర్తుంచుకోవలసిన సత్యాలు. ఆదినారాయణరావు గారి బాణిలో ఆమాటలు అలా అలవోకగా నోటికి వచ్చేస్తాయి. రామకృష్ణ గారి స్వరం కూడా ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకుంటుంది.
 
ఆడియోలో ఒకే పాటగా విడుదలైనా సినిమాలో ఈ పాట మొదటి రెండు చరణాలు ఒకసారి మిగిలిన రెండు చరణాలు వేరే పాటలా వస్తాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చివరి రెండు చరణాలు పడవెళ్ళిపోతోందిరా పాటగా ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరథి
గానం: రామకృష్ణ

శ్యామ సుందరా ప్రేమ మందిరా
నీ నామమే వీనుల విందురా
నీ నామమే వీనుల విందురా..
శ్యామసుందరా ...

అణువణువు నీ ఆలయమేరా.. నీవే లేని చోటు లేదురా
అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటు లేదురా
నేనని నీవని లేనే లేదూ నీకు నాకు బేధమే లేదు

||శ్యామ సుందరా||
సుఖ దుఃఖాలకు నిలయం దేహం ఈ దేహము పై ఎందుకు మోహం
అహము విడిచితే ఆనందమురా అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం బోధలు వింటే తొలగిపోవును శోకమురా

||శ్యామ సుందరా||
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా (2)
అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట సాధ్యమురా..
హాయిగ త్రాగుట సాధ్యమురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

కాలసర్పమును మెడలో దాల్చి పూల మాలగా తలచ వచ్చురా...
పూల మాలగా తలచ వచ్చురా
ఏకాగ్రతతో ధ్యానము చేసి లోకేశ్వరునే చేరవచ్చురా..
లోకేశ్వరునే చేరవచ్చురా

దాస తుకారాం తత్వ బోధతో తరించి ముక్తిని పొందుమురా..
తరించి ముక్తిని పొందుమురా

సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

ఓహోహో హొయ్యారె హొయ్యారే హొయ్ హొయ్యా.. హొహోయ్..
ఓహోహో హొయ్యారె హొయ్యారే హొయ్ హొయ్యా.. 


అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు హొహోయ్ (2)
దొడ్డమానులను కూల్చు తుఫాను గడ్డి పరకను కదల్చగలదా.. కదల్చగలదా
చిన్న చీమలకు చక్కెర దొరుకును గొప్ప మనిషికి ఉప్పే కరువు.. ఉప్పే కరువు
అణకువ కోరే తుకారామునీ మనసే దేవుని మందిరము.. మనసే దేవుని మందిరము
హోయ్ అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు హొహోయ్
అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు

హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

పడవెళ్ళిపోతోందిరా...ఆ ఆ ఆ ఆ ఓ ఓ ...
పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా దరి చేరే దారేదిరా
నీ జీవితము కెరటాల పాలాయెరా
పడవెళ్ళిపోతోందిరా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..

తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే(2)
ఆ పాండురంగడున్నాడురా ఆ ఆ ... నీ మనసు గోడు వింటాడురా
నీ భారమతడే మోసేనురా ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా..
పడవెళ్ళిపోతోందిరా.....

బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు(2)
ఇది శాశ్వతమని తలచేవురా ఆ ఆ...
నీవెందుకని మురిసేవురా..
నువు దరిజేరే దారి వెదకరా ఓ మానవుడా హరినామం మరువవద్దురా..
పడవెళ్ళిపోతుందిరా ఆ ఆ......

హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

4 comments:

చాలా మంచి పాటను పంచుకున్నందుకు ధన్యవాదాలు వేణు గారు
ఇలాంటిపాట రోజుకు ఒక్కసారి విన్నా ఎంతో ప్రశాంతత లభిస్తుంది

థ్యాంక్స్ హరే... నిజమే ఉదయాన్నేవింటే రోజంతా ఆహ్లాదకరంగా గడుస్తుంది.

ఓ మంచి పాట.
ఇంతకంటె ఏం వ్యాఖ్య చెయ్యాలో తెలియదు.

థాంక్స్ రామచంద్రరావు గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.